![]() |
![]() |
.webp)
రోజు రోజుకి వీక్షకాదరణ పొందుతూ వస్తున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. శుక్రవారం ఎపిసోడ్-653 లో.. పోలీస్ స్టేషన్ లో ఉన్న వసుధారని కలుస్తాడు రిషి. "అసలేం జరిగిందో చెప్పు వసుధార" అని బ్రతిమాలుకుంటాడు రిషి. అయితే వసుధార ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. మధ్యలో రాజీవ్ కల్పించుకొని రిషితో గొడవకు దిగుతాడు. రాజీవ్ మాట్లాడుతూ "చెప్తే వినబడటం లేదా రిషి సర్. వసుధార నా భార్య అని చెప్పాను కదా" అని అంటాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆ మాట విని రిషి ఎమోషనల్ అవుతాడు. "ఏంటి వసుధార.. నువ్వు తాళి కట్టించుకున్నావా?" అని అడుగుతాడు. కానీ వసుధార ఎలాంటి సమాధానం చెప్పదు. దాంతో రిషి బాధతో ఏడుస్తుంటాడు. ఎమోషనల్ అవుతున్న రిషిని బయటికి తీసుకెళ్తాడు మహేంద్ర. ఆ తర్వాత వసుధార దగ్గరికెళుతోంది జగతి. "వసుధార.. ఆ తాళి ఏంటి? " అని అడుగుతుంది. "నాకు పెళ్లి అయింది. అందుకే నా మెడలో తాళి ఉంది. అంతకు మించి నన్నేం అడుగకండి" అని వసుధార చెప్తుంది. దాంతో ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగతి.
అలా అందరూ వెళ్ళిపోయాక "మీరు బాగుండాలి. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను" అని వసుధార ఒక్కతే తనలో తాను బాధపడుతుంది. ఆ తర్వాత దేవయానికి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు రాజీవ్. వసుధారకి బెయిల్ ఇప్పించమని అడుగుతాడు. " సరే.. కానీ నేను ఒకసారి వసుధారని కలవాలి" అని అడుగుతుంది. "సరే మేడం" అని రాజీవ్ చెప్తాడు.
దేవయాని పోలీస్ స్టేషన్ లో ఉన్న వసుధార దగ్గరికి వచ్చి తనని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. "ఎక్కడ ఉండే దానివి. ఎక్కడికో వెళ్లి ఇప్పుడు కింద పడ్డావ్. ఇలా స్టేషన్ లో ఊసలు లెక్కపెడ్తున్నావ్. ఎన్ని మాటలు అన్నావ్. అలాంటి నువ్వే ఇలా ధైర్యం కోల్పోతే ఎలా?" అంటూ దేవయాని వ్యంగ్యంగా అడుగుతుంది. దానికి బదులుగా వసుధార మాట్లాడుతూ "ప్రయాణం బాగా సాగిందా మేడం. చాలా దూరం నుండి వచ్చారు కదా. అలసిపోయినట్టున్నారు. నాకు ఇప్పుడేదో కష్టం వచ్చిందని నన్ను మీరు అనాల్సిన అవసరం లేదు. ఇది కొన్ని రోజులే" అని అంటుంది. "మళ్ళీ రిషి నీ లైఫ్ లోకి వస్తాడని ఎలా అనుకుంటున్నావ్. మళ్ళీ మా ఇంట్లోకి అడుగుపెడతాననే అనుకుంటున్నావా.. అది జరుగదు" అని దేవయాని అంటుంది. "నాకు పొగరు అనుకోకపోతే ఒక మాట చెప్తాను. నాది పొగరు కాదు. ఆత్మవిశ్వాసం" అని వసుధార సమాధానమిస్తుంది. ఆ తర్వాత దేవయాని వెళ్ళిపోతుంటే వసుధార చిటికె వేసి పిలుస్తుంది. "మళ్ళీ కలుద్దాం మేడం" అని అంటుంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |